Home Politics Andhra Pradesh ప్రపంచ వేదికను రాజకీయ వేదికగా మార్చడం దురదృష్టకరం

ప్రపంచ వేదికను రాజకీయ వేదికగా మార్చడం దురదృష్టకరం

0

-ఆవిష్కరణల దిశగా నడుస్తుంటే కాంగ్రెస్ అవివేక ప్రదర్శన

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదిక వద్ద ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన “షర్టుల విప్పి” ప్రదర్శనపై ఆదివారం విశాఖపట్నంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ..దేశ ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై ప్రతిబింబించాల్సిన అంతర్జాతీయ సదస్సును యువ కాంగ్రెస్ రాజకీయ ప్రదర్శనగా మార్చడం తీవ్రంగా ఖండనీయమన్నారు. భారతదేశం కృత్రిమ మేధస్సు రంగంలో ఎదుగుతున్న శక్తిగా నిలుస్తున్న వేళ, ఇలాంటి అవివేక చర్యలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్‌ను అభివృద్ధి చెందుతున్న ఏఐ శక్తిగా చూస్తున్న సమయంలో, దేశ ప్రయోజనాల కంటే పార్టీ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై రాజకీయ హంగామాలు చేయడం ద్వారా మన దేశ ప్రతిష్ఠను తగ్గించడమే తప్ప మరే ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. భారతదేశం ఆవిష్కరణలు, సాంకేతిక ప్రగతి, యువత ప్రతిభతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న వేళ, చిన్నచూపు రాజకీయాలతో దేశాన్ని అపహాస్యం చేయకూడదని స్పష్టం చేశారు. దేశ నిర్మాణంలో భాగస్వాములుగా మారాల్సిన యువత, అంతర్జాతీయ వేదికలను అవమానించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొని మాటాడుతూ యువ కాంగ్రెస్ ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. అలాగే ఇతర కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు. దేశ గౌరవం రాజకీయాలకు అతీతమని, అభివృద్ధి, ఆవిష్కరణల దిశగా మనం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ నిరసనలో టీడీపీ నగర అధ్యక్షులు పట్టాభిరామ్, టీడీపీ దక్షిణ నాయకుడు సీతంరాజు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version