Home Politics Andhra Pradesh తమ్మినేనిపై అభిశంసన

తమ్మినేనిపై అభిశంసన

0

కమ్యూనిస్టు నేతపై క్రమశిక్షణ చర్య

రాజకీయంగా తీవ్ర ఆరోపణలు

వ్యూహకర్తగా ఫెయిల్

అస్థిత్వానికే ముప్పు తెచ్చారు

సీపీఎం కేంద్ర కమిటీ కొరడా

సీపీఎం సీనియర్ నాయకుడు, తెలంగాణ మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. జీవితాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం పోరాడిన ఒక కీలక నేతపై ఇటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోవడం వెనుక అనేక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగం ప్రకారం అభిశంసన అనేది ఒక తీవ్రమైన క్రమశిక్షణ చర్య. పార్టీ నిబంధనలను ఉల్లంఘించినా లేదా పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే పనులు చేసినా ఈ చర్య తీసుకుంటారు. ఇది బహిష్కరణ లేదా సస్పెన్షన్ కంటే తక్కువ స్థాయిదైనప్పటికీ, ఒక నాయకుడి రాజకీయ జీవితంలో ఇది ఒక మచ్చగా పరిగణిస్తారు. తప్పును అధికారికంగా ఎత్తిచూపుతూ, భవిష్యత్తులో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడమే దీని ఉద్దేశం. తమ్మినేని వీరభద్రంపై కేంద్ర కమిటీ ప్రధానంగా రాజకీయ వ్యూహకర్తగా విఫలమయ్యారనే ఆరోపణలు చేసింది. రాష్ట్ర కార్యదర్శిగా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీ అస్తిత్వానికే ముప్పు తెచ్చాయని హైకమాండ్ భావించింది. ముఖ్యంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ప్రయోగం ఘోరంగా విఫలమవ్వడం, దాని వల్ల పార్టీకి రావాల్సిన ఓట్లు కూడా చీలిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక సమయంలో తమ్మినేని తన వర్గానికి అనుకూలంగా లాబీయింగ్‌కు పాల్పడ్డారని, తెరవెనుక మంత్రాంగాలు నడిపారని పార్టీ గుర్తించింది. ఇది సీపీఎం పద్ధతులకు విరుద్ధమని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలకు తమ్మినేని ఇచ్చిన వివరణలో ఎక్కడా ఆత్మవిమర్శ కనిపించలేదని, చేసిన తప్పులను సమర్థించుకోవడానికే ప్రయత్నించారని పార్టీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ సీపీఎంలో గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఒకప్పుడు అసెంబ్లీలో బలమైన గళం వినిపించిన సీపీఎం, తమ్మినేని సారథ్యంలో వరుసగా రెండు సార్లు ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. పార్టీని బలోపేతం చేయడంలో కంటే, సొంత ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చారని ప్రత్యర్థి వర్గం చేసిన ఫిర్యాదులను ద్విసభ్య కమిటీ విచారించి నిజమని తేల్చింది.

కేవలం తమ్మినేనిపైనే కాకుండా, ఆయనకు సహకరించిన మరో ఇద్దరు కీలక నేతలపై కూడా సీపీఎం కేంద్ర కమిటీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మిగతా ఇద్దరు ఎవరు అన్నది బయటకు రాలేదు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని ఈ చర్య ద్వారా కేంద్ర నాయకత్వం కేడర్‌కు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది. సుదీర్ఘకాలం పాటు పార్టీని నడిపించిన ఒక నాయకుడు ఇలా అభిశంసన కు గురికావడం తెలంగాణ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక అరుదైన , విచారకరమైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version