న్యాయమూర్తుల సమక్షంలో దండలు మార్చుకున్న వైనo
అభినందించిన గ్రామ పెద్దలు ఏపిపి
విద్యావంతులైన ఇరువురు యువతీ యువకులు ఆరు మాసాల క్రితం హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అంతలోనే వారిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు చోటుచేసుకుని దూరమయ్యారు. దీనిపై చోడవరం కోర్టులో కేసు దాకలైంది. ఈ నేపథ్యంలో ఏపీపి చీపురుపల్లి సూర్యనారాయణ చొరవ తీసుకొని వారిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి, వారి తల్లిదండ్రులతో చర్చించి న్యాయమూర్తులు సమక్షంలో మరల ఒకటిగా చేశారు. దీంతో వారిద్దరి చేత న్యాయమూర్తులు దండలు మార్పించి ఒకటిగా చేస్తూ కలకాలం ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు. వివరాలు పరిశీలిస్తే చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వుగ్గిన దొరతో ఆరు మాసాల క్రితం విశాఖకు చెందిన సింధుతో వివాహం జరిగింది. అయితే ఎంబీఏ చదువుకున్న దొర ఉద్యోగం చేస్తుండగా, సింధు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విజ్ఞాన్ కాలేజీలో పనిచేస్తుంది. అయితే మనస్పర్ధలుమూలంగా దూరంగా ఉంటూ విడాకుల కోసం చోడవరం సివిల్ జడ్జి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై ఇద్దర్నీ ఒకటిగా చేయాలన్న ఏపీపీ సంకల్పం నెరవేరింది. ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో అమ్మాయి అత్తవారింటికి వెళ్లేందుకు అంగీకారం తెలపడంతో బుధవారం కోర్టు హాలులో అదనపు జిల్లా జడ్జి హరి నారాయణ, సీనియర్ సివిల్ జడ్జి గౌరీశంకర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ స్వర్ణ, ఏపీపీ సూర్యనారాయణ సమక్షంలో దండలు మార్పించి అభినందించారు. చిన్న చిన్న మనస్పర్ధలతో విడిపోవాలనుకున్న దంపతులకు వీరు స్ఫూర్తిదాయకమని న్యాయమూర్తులు చెబుతూ.. వీరిని ఆదర్శంగా తీసుకోవాలని, కలసి మెలిసి కమ్మని దాoపత్యాన్ని కొనసాగించాలని కోరారు.ఈ సందర్భంగా దొర, సింధు మాట్లాడుతూ తిరిగి మమ్మల్ని ఒకటిగా చేసి మాలో సంతోషాన్ని నింపిన ఏపిపి సూర్యనారాయణకు వారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే లక్ష్మీపురం గ్రామ పెద్దలు సిరిసొల్ల సత్యారావు, భూతనాథ్నీ నాని కుమార్ తదితరులు కూడా వారిని అభినందించారు.
