రాజమండ్రి పరిసరాల్లో పులి సంచారం కొనసాగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కనీస బాధ్యత కూడా చూపడం లేదని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు.
పులి సంచారం కారణంగా గ్రామాలు, వ్యవసాయ తోటలు, నివాస ప్రాంతాల్లో ప్రజలు భయంతో జీవిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పులిని తక్షణమే బంధించి ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆలస్యం వల్ల మానవ ప్రాణ నష్టం జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు.
పులి దాడిలో పశువులు మృతి చెందడంతో రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారని, బాధితులకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే వైసీపీ తరఫున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. అవసరమైతే పార్టీ తరఫున బాధిత రైతులను ఆదుకుంటామని తెలిపారు.
కూటమి నాయకులు ప్రతిపక్షాలపై కక్ష సాధింపు రాజకీయాలు మాని, ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజమండ్రి వాసులను పులి భయం నుంచి కాపాడటం ప్రభుత్వ తక్షణ బాధ్యత అని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.
