డ్రైవర్లను ప్రత్యక్షంగా పర్యవేక్షణ
*రోడ్డు భద్రత కోసం మంత్రి మండిపల్లి ప్రత్యేక చొరవ.*
రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, ఈ నేపథ్యంలో కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, బస్సు డ్రైవర్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించే విధానాన్ని ప్రారంభించామని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
వాహనాల్లో ఏర్పాటు చేసిన డ్యాష్‌క్యామ్‌ల ద్వారా డ్రైవర్ ప్రవర్తన, వాహనం ముందు దృశ్యాలు నిరంతరం రికార్డ్ అవుతున్నాయని తెలిపారు.
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ధూమపానం వంటి అనుచిత చర్యలు గుర్తించిన వెంటనే అలర్ట్‌లు వస్తాయని, వాటి ఆధారంగా కంట్రోల్ రూమ్ నుండి డ్రైవర్లను తక్షణమే హెచ్చరిస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా వాహనాల వేగాన్ని కూడా ఈ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ డేటాను 8 రోజుల పాటు భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల బస్సు యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యవస్థ అమలుకు పూర్తి సహకారం అందించడానికి అంగీకరించారని చెప్పారు.
ప్రస్తుతం ఐ ఆర్ ఏ ట్రావెల్స్‌కు చెందిన 24 బస్సుల్లో ఈ సిస్టమ్ అమలులో ఉందని తెలిపారు. తదుపరి 15 నుంచి 30 రోజుల్లో అన్ని బస్సులకు ఈ వ్యవస్థను విస్తరించే లక్ష్యంతో పని చేస్తున్నామని, త్వరలోనే అధునాతన సదుపాయాలతో పెద్ద కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.
1500 బస్సుల్లో ఈ వ్యవస్థ అమలు పూర్తైన తర్వాత అధికారిక ప్రారంభోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
ఒక్కో బస్సుకు ఈ సిస్టమ్ అమలుకు సుమారు రూ.12,000 ఖర్చు అవుతుందని, నెలవారీ నిర్వహణ ఖర్చు రూ.750 వరకు ఉంటుందని తెలిపారు.
ఈ మొత్తం వ్యయాన్ని బస్సు యజమానులే భరించడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో ఇది కీలకమైన అడుగుగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
డ్రైవర్ల భద్రతతో పాటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో ఈ సాంకేతిక వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు.
