Friday, May 1, 2026
HomeNewsదళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ కు డిమాండ్

దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ కు డిమాండ్

రాజమహేంద్రవరం నగరంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కల్పించిన హక్కులను దెబ్బతీసే విధంగా దేశంలో పాలన కొనసాగుతోందని పలు రాజకీయ పార్టీలు, క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన కృష్ణసాయి కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది.
సమావేశంలో కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకుడు టి. మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి. అరుణ్, చాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్, కెకె సంజీవరావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపకుడు దేశిరెడ్డి బలరామ నాయుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తాళ్లూరి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వక్తలు మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ తన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే హక్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. అయితే మతం మారితే రిజర్వేషన్లు కోల్పోవాలనే పరిస్థితి రావడం దురదృష్టకరమని విమర్శించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వం దీనిపై పునర్విమర్శ చేపట్టాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో చర్చించి రాజ్యాంగ సవరణ ద్వారా దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు అఖిలపక్షంగా ముందుకు వస్తామని స్పష్టం చేశారు.అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. అలాగే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మార్టిన్ లూథర్, డాక్టర్ వడయార్, బెజవాడ రంగారావు, అలాగే ఇతర నాయకులు పవన్, కొండలరావు, కూండ్రపు రాంబాబు, పూర్ణిమారాజ్, సింధియా రాణి, శ్రీనివాస్, యాళ్ల వీరభద్రరావు, నిల్లా వీర్రాజు, తాడి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం, నల్లా రామారావు తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments