పాడేరు ఐసిడిఎస్ కేంద్ర కార్యాలయానికి రూ. 25 లక్షలు, శిశు గృహ భవనానికి రూ. 5లక్షలు
అల్లూరి జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన 15 అంగనవాడీ కేంద్రాలకు రూ.87 లక్షలు
ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర
పాడేరులో నిర్మాణం జరుగుతున్న జిల్లా కేంద్ర ఐసిడిఎస్ భవన పనులు పరిశీలన
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి భవనాల కోసం రూ.1.17 కోట్లు మంజూరు చేసినట్లు ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్తు జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. పాడేరులో ఐసిడిఎస్ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణ పనులను సుభద్ర బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో శిశు సమగ్ర అభివృద్ధి భవనాల నిర్మాణం కోసం జిల్లా పరిషత్ నుంచి ఎన్నడూ లేని విధంగా అత్యధిక నిధులను కేటాయించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో స్వతంత్ర సమరయోధులు, మనందరికీ స్ఫూర్తిదాత అల్లూరి సీతారామరాజు పేరిట ఏర్పడిన కొత్త జిల్లాలో సొంత భవనాల నిర్మాణం కోసం తన వంతు సహకారం అందిస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ నుంచి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు అన్నారు. ఈ క్రమంలో సమగ్ర శిశు అభివృద్ధి ( ఐసిడిఎస్ ) భవనాలు నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అందులో ఐసిడిఎస్ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్ర కార్యాలయ భవనానికి రూ.30 లక్షల మంజూరు చేసినట్లు చెప్పారు. దీంతోపాటు శిశు గృహ నూతన భవనానికి మరో రూ. 5లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసిడిఎస్ కేంద్ర కార్యాలయం, శిశు గృహ భవనం నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ పనులు నిర్మాణ ప్రక్రియను పరిశీలించేందుకు ఈరోజు పాడేరు రావడం జరిగిందని ఈ భవనాల నిర్మాణం పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అయితే సమగ్ర శిశు అభివృద్ధి భవన నిర్మాణంలో రాజీ పడొద్దని సూచించారు.
*అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ భవనాలకు రూ. 87 లక్షలు*
అల్లూరి సీతారామరాజు జిల్లాలో అసంపూర్తిగా నిలిచిపోయిన 17 అంగన్ వాడీ భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు జిల్లా పరిషత్ నుంచి రూ.87 లక్షలు మంజూరు చేసినట్లు జల్లిపల్లి సుభద్ర వెల్లడించారు. వీటిల్లో జీకే వీధి, జి.మాడుగుల, పాడేరు, అనంతగిరి, అరకు, డుంబ్రిగూడ, ముంచంగిపుట్టు మండలాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్వాడీ కేంద్రాలకు ఈ నిధులు కేటాయించినట్లు ఆమె తెలిపారు.
