ఐదుగురి ఆరోగ్యం స్థిరం – ఇద్దరు వెంటిలేటర్‌పై చికిత్స
రాజమహేంద్రవరం, జయజయహే ప్రతినిధి:
రాజమహేంద్రవరం నగరంలో నమోదైన అనూరియా కేసుల నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ కూడా ఆమెతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు రోగుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి రోగికి అత్యుత్తమ వైద్య సదుపాయాలు అందేలా చూడాలని, అవసరమైన మందులు, పరికరాలు, నిపుణుల సేవలు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.
వైద్యుల వివరాల ప్రకారం చికిత్స పొందుతున్న ఏడుగురిలో ఐదుగురి ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉంది. మరో ఇద్దరికి వెంటిలేటర్‌పై ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య చర్యలు తీసుకుంటున్నామని వైద్యులు కలెక్టర్‌కు వివరించారు.
ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో కూడా సమీక్ష కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహిస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం రోగుల బంధువులతో మాట్లాడిన కలెక్టర్ కీర్తి చేకూరి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని, మెరుగైన చికిత్సకు ఎటువంటి లోటు ఉండదని భరోసా ఇచ్చారు.
ఈ పరిశీలనలో జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవా సమన్వయ కర్త పి. ప్రియాంకతో పాటు ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.
