తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెలసిన శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్‌కు చెందిన జి.గోపీనాథ్ – జయలక్ష్మి (ఐఏఎస్) దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, నిడదవోలు తహశీల్దార్ నాగరాజు నాయక్‌తో పాటు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి వి.హరి సూర్య ప్రకాష్ ఆలయ సంప్రదాయాల ప్రకారం అతిథులకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు దేవులపల్లి రవిశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులు ఆరా తీశారు. గ్రామ ప్రజలు, భక్తులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.
