ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
ప్రస్తుతానికైతే మంత్రివర్గ విస్తరణ వార్తలు ఊహాగానాలేనని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి పదవి తనకు కొత్త కాదని, ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజిత ఆంధ్రప్రదేశ్ లోనూ మంత్రిగా పని చేశానని పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా దర్శనం కోసం గురువారం ఆశీలుమెట్ట సంపత్ వినాయగర్ ఆలయానికి వచ్చిన ఆయన్ని మీడియా ప్రతినిధులు కలిసి.. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి కదా! మంత్రి పదవి ఆశిస్తున్నారా? అని ప్రశ్నించగా, ఎవరిని తీసుకోవాలి.. ఎవరిని తప్పించాలి అనే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పూర్తి స్పష్టత ఉంటుందని చెప్పారు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబుకు ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తెలుసునని.. సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందని భావిస్తున్నానని చెప్పారు. అయితే మంత్రి వర్గ విస్తరణ వార్తల్లో నిజం లేదని తెలిపారు.
