Home Politics Andhra Pradesh వైరల్ వీరత్వం వెనుక ముసుగు… జయశాంతి వ్యవహారంలో బయటపడుతున్న సంచలన నిజాలు

వైరల్ వీరత్వం వెనుక ముసుగు… జయశాంతి వ్యవహారంలో బయటపడుతున్న సంచలన నిజాలు

0

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ జయశాంతి పేరు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, రాజకీయ వేదికలపై పెద్ద చర్చకే కారణమైంది. చంటి బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన వీడియో ఒక్కసారిగా వైరల్ కావడంతో ఆమెను “డ్యూటీకి అంకితమైన మహిళా పోలీస్”గా పొగడ్తలతో ముంచేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రశంసలు, హోం మంత్రి అనిత ఇంటికి ఆహ్వానించి సన్మానం చేయడం వరకు వ్యవహారం వెళ్లింది. కానీ ఇప్పుడు ఆ వైరల్ వీరత్వం వెనుక ఉన్న మరో కోణం బయటపడడంతో ఈ కేసు తీవ్ర వివాదంగా మారింది.
విద్యాశాఖ అధికారుల విచారణలో గత ఏడాది జరిగిన డీఎస్సీలో జయశాంతి తప్పుడు ఈడబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందినట్లు నిర్ధారణ అయ్యింది. కానిస్టేబుల్‌గా ఉన్న భర్త తాతారావు ఆదాయాన్ని దాచిపెట్టి, తండ్రిని సంరక్షకుడిగా చూపిస్తూ సర్టిఫికెట్ పొందినట్టు అధికారులు గుర్తించారు. దీంతో డీఎస్సీ ఉద్యోగాన్ని రద్దు చేసిన విద్యాశాఖ, ప్రభుత్వాన్ని మోసం చేసిన వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కాకినాడ డీఈవో తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇదే సమయంలో నకిలీ ఐడీ కార్డుతో ఎస్ఐగా చలామణి అవుతున్న కామేశ్వరరావు అనే హెడ్ కానిస్టేబుల్‌కు జయశాంతి సహకరించిందన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఇటీవల జరిగిన ట్రాఫిక్ ఘటన కూడా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. క్రమశిక్షణ చర్యలలో భాగంగా జయశాంతిని రైల్వే విభాగం నుంచి లా అండ్ ఆర్డర్‌కు, ఆమె భర్తను ఇతర యూనిట్‌కు బదిలీ చేయడం ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది.
వైరల్ కథనాల వెనుక వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజంగా ఇది సేవా మనసా? లేక విమర్శల నుంచి తప్పించుకునే వ్యూహమా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version