వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు పోసి కుమార్
తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం నాయకులు పలు కీలక డిమాండ్లతో వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రాన్ని జిల్లా డీఆర్వో సీతారామ మూర్తికి సమర్పించారు.
ఈ సందర్భంగా ముత్యాల పోసి కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరితగతిన నింపాలని కోరారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి 25 చొప్పున మొత్తం 4375 మంది లబ్ధిదారులను గుర్తించి, మూడు చక్రాల మోటార్ సైకిళ్లను వెంటనే అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
దివ్యాంగులకు డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో ప్రత్యేక మేళాలు నిర్వహించి, చలానా రూ.260 మరియు లైసెన్సు ఫీజు రూ.770 కలిపి మొత్తం రూ.1030ను ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ‘ఇంద్రధనస్సు’లో ప్రకటించిన ఏడు వరాలను తక్షణమే అమలు చేసి, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ వినతి పత్రం రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షులు పులిపాటి దుర్గా రెడ్డి ఆదేశాల మేరకు, అలాగే జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ సూచనల మేరకు సమర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల విభాగం ఉపాధ్యక్షులు ఆదం పకీర్ పాల్గొన్నారు.
