Home Politics Andhra Pradesh కల్తీ పాలు కలకలం

కల్తీ పాలు కలకలం

0

కూలెంట్ లీకేజీతో పాలలో ఇథిలీన్ గ్లైకాల్ –
ఆరోగ్య సమస్యలకు ఇదే కారణమా? అనదికార కూలింగ్ ఛాంబర్ సీజ్ అధికారుల దర్యాప్తు ముమ్మరం
రాజమండ్రి నగరాన్ని కుదిపేసిన కల్తీ పాలు ఘటనలో కీలక మలుపు తిరిగింది. ఫ్రిడ్జ్‌లలో ఉష్ణోగ్రత నియంత్రణ కోసం ఉపయోగించే కూలెంట్ పదార్థమైన ఇథిలీన్ గ్లైకాల్ లీకేజీ కారణంగానే పాలలో కల్తీ జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఈ అంశం బయటపడడంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి.
అధికారుల దర్యాప్తులో “వరలక్ష్మీ డెయిరీ” పేరిట అనధికారికంగా “గణేశ్ కూలింగ్ ఛాంబర్” నిర్వహిస్తున్నట్టు బయటపడింది. సరైన లైసెన్సులు, ఆహార భద్రతా అనుమతులు లేకుండానే పెద్ద మొత్తంలో పాలను నిల్వ చేసి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వారం రోజుల క్రితం ఒక కూలింగ్ యూనిట్‌కు మరమ్మతులు చేపట్టిన సమయంలో కూలెంట్ పైపుల్లో లీకేజీ ఏర్పడి, అక్కడ నిల్వ ఉన్న పాలలోకి ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు అనుమానిస్తున్నారు. మరమ్మతుల సమయంలో సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడం, పర్యవేక్షణ లోపించడమే ఈ ప్రమాదానికి దారితీసిందని అధికారులు భావిస్తున్నారు.
ఇథిలీన్ గ్లైకాల్ అనేది సాధారణంగా ఫ్రిజ్‌లు, చిల్లర్లు వంటి శీతలీకరణ వ్యవస్థల్లో వినియోగించే రసాయనం. ఇది మానవ శరీరానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పదార్థం శరీరంలోకి చేరితే మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, వాంతులు, తలనొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపించవచ్చని పేర్కొన్నారు. ఇటీవల నగరంలో నమోదైన అనారోగ్య కేసుల నేపథ్యంలో ఈ కల్తీ పాలు కారణమై ఉండొచ్చనే కోణంలో అధికారులు విచారణ సాగిస్తున్నారు.
కల్తీ పాలు సరఫరా అయిన ప్రాంతాలను గుర్తించి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. తుది నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇప్పటికే అనధికారికంగా నడుస్తున్న కూలింగ్ ఛాంబర్‌ను సీజ్ చేసి, యజమానులపై కేసులు నమోదు చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆహార భద్రతా విభాగం ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. నగరంలోని ఇతర డెయిరీలు, కూలింగ్ సెంటర్లపై కూడా అకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాల సేకరణ, నిల్వ, సరఫరా విధానాల్లో లోపాలుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని జిల్లా వైద్యాధికారులు సూచించారు. ఆహార భద్రతపై రాజీ పడబోమని, బాధ్యులెవరైనా వదిలిపెట్టబోమని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.
నగరంలో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్న ఈ ఘటనపై ప్రజలు సమగ్ర దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version