Home Politics Andhra Pradesh కల్తీ పాలు ఘటనలో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ దేవకుమార్

కల్తీ పాలు ఘటనలో నిందితుడు అరెస్ట్: డీఎస్పీ దేవకుమార్

0

నగరంలో సంచలనం సృష్టించిన కల్తీ పాలు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు కొవ్వూరు సబ్ డివిజన్ డీఎస్పీ దేవ కుమార్ తెలిపారు. విషపూరిత రసాయనం (ఇథైలిన్ గ్లైకాల్) కలిసిన పాలను సేవించడం వల్ల బాధితులు కిడ్నీ వైఫల్యానికి గురై మృతి చెందినట్లు ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు.
డీఎస్పీ దేవకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 16న సరఫరా చేసిన పాలను తాగిన పలువురికి మూత్ర విసర్జన ఆపడం, కిడ్నీ సంబంధిత సమస్యలు రావడంతో వివిధ ఆసుపత్రుల్లో చేరారు. ఫిబ్రవరి 22న కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ తాడి కృష్ణవేణి (76) మృతి చెందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె కుమారుడు తాడి సీతారామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా బాధితుల రక్త నమూనాలు, పాలు, పెరుగు నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ, రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలకు పంపినట్లు తెలిపారు. ల్యాబ్ నివేదికల ప్రకారం ఇథైలిన్ గ్లైకాల్ కలిసిన కల్తీ పాలను సేవించడం వల్ల ఆక్యుట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఏర్పడి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కారణంగా మరణాలు సంభవించినట్లు నిర్ధారణ అయిందన్నారు.
దర్యాప్తులో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన అడ్డాల గణేశ్వరరావు (37) స్థానిక రైతుల వద్ద నుంచి పాలు సేకరించి రాజమహేంద్రవరం లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరనగర్, స్వరూప్‌నగర్ ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 24 మధ్య సుమారు 20 మంది అనారోగ్యానికి గురవగా, ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా మరో 11 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న అడ్డాల గణేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. అతనిపై పలు కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version