Saturday, April 18, 2026
HomeUncategorizedగూగుల్ డేటా సెంటర్ భూ బాధితుల హామీ నెరవేరుస్తాం

గూగుల్ డేటా సెంటర్ భూ బాధితుల హామీ నెరవేరుస్తాం

తర్లువాడ రైతులకు గంటా భరోసా

రాష్ట్ర ప్రగతిని మార్చే గేమ్ చేంజర్ గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన రైతుల త్యాగాన్ని ప్రభుత్వం మర్చిపోదని, చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం తర్లువాడ రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈనెల 28 న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముందే నష్ట పరిహారం, భూములు, ఉపాధి కల్పన వంటివి అందించాలని రైతులు విన్నవించారు. గుడిలోవ నుంచి గూగుల్ డేటా సెంటర్ కు నిర్మిస్తున్న రోడ్డు కోసం 2.5 ఎకరాలు తీసుకుని పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకూ రెవిన్యూ అధికారులు తమతో పరిహారం గురించి చర్చించలేదని ఇద్దరు రైతులు ఫిర్యాదు చేయగా గంటా శ్రీనివాసరావు వెంటనే ఎమ్మార్వో శ్రీనుబాబుతో మాట్లాడి సర్వే చేసి ఎంత భూమి తీసుకున్నది తేల్చి.. పరిహారం ఫైలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రెవిన్యూ రికార్డుల్లో పేర్లు తప్పు పడ్డాయన్న కారణంతో నష్ట పరిహారం ఇవ్వలేదని కొందరు.. భూ హక్కులపై రెండు కుటుంబాల మధ్య వివాదం నడుస్తుండగా సంబంధం లేని మూడో వ్యక్తి పేరును రెవిన్యూ రికార్డుల్లో నమోదు చేసేశారని మరికొందరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. జిరాయతీ భూమికి, డి పట్టా భూమికి ఒకే పరిహారాన్ని ప్రకటించడం పట్ల ఇంకో రైతు అభ్యంతరం ప్రకటించారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు 51 మందికి జాతీయ రహదారి వెంబడి షాపింగ్ కాంప్లెక్స్ లో 20 ` 25 సైజు షాపులు.. కుటుంబానికి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం.. 620 మందికి 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు.. ఇవ్వాలని రైతులు కోరారు. ఎకరా డి పట్టా భూమికి 20 సెంట్ల చొప్పున ప్రభుత్వం ప్రకటించిన భూమి పత్రాలనూ శంకుస్థాపనకు ముందే ఇవ్వాలన్నారు. వీటిపై గంటా స్పందిస్తూ ప్రభుత్వం చెప్పిన ప్రతీ హామీని అమలు చేస్తామని, ఇందులో ఎలాంటి అపోహలకు తావు లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిక్కాల విజయ్ బాబు, ఘట్టమనేని సుభాష్ చంద్రబోస్, తాట్రాజు అప్పారావు, బి.ఆర్.బి. నాయుడు, బాలి అయ్యప్ప, మజ్జి శ్రీను, కోరాడ ఆదినారాయణ, బంకు రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments