Friday, May 1, 2026
HomeNewsరాజమహేంద్రవరం అంతర్జాతీయ క్రీడా పటంలోకి – డ్రాగన్ బోట్ లీగ్ 2026కి వేదికగా రాజమండ్రి

రాజమహేంద్రవరం అంతర్జాతీయ క్రీడా పటంలోకి – డ్రాగన్ బోట్ లీగ్ 2026కి వేదికగా రాజమండ్రి

రాజమహేంద్రవరం నగరం త్వరలో అంతర్జాతీయ క్రీడా వేదికగా మారబోతోంది. చైనా మూలాలున్న డ్రాగన్ బోట్ క్రీడకు చెందిన ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్-2026 పోటీలు మే 30, 31, జూన్ 1 తేదీల్లో రాజమండ్రిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ పోటీలు జరగడం విశేషం.
ఈ ఈవెంట్‌ను “థింక్ అవుట్ సైడ్” మరియు ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం రాజమండ్రిలో లోగో, జెర్సీ, టీజర్, అధికారిక బ్యానర్ మరియు వెబ్‌సైట్‌ను ప్రజాప్రతినిధులు ఘనంగా ఆవిష్కరించారు. సోషల్ మీడియా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.
దాదాపు 2000 ఏళ్ల చరిత్ర కలిగిన డ్రాగన్ బోట్ క్రీడ చైనాలో ప్రారంభమై, టీమ్ స్పిరిట్ మరియు సమన్వయానికి ప్రతీకగా నిలిచింది. ఈ పోటీల్లో సుమారు 25 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా
ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ… రాజమండ్రిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగు అని చెప్పారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ…రాజమండ్రిని క్రీడా రాజధానిగా మార్చే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాలు 2027కి నాందిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ….రాజమండ్రిని వాటర్ గేమ్స్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రూ.53 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం జరుగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా క్రీడా రంగానికి పూర్తి మద్దతు ఇస్తోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు.
ఈ అంతర్జాతీయ ఈవెంట్ ద్వారా రాజమండ్రికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడంతో పాటు పర్యాటక రంగానికి భారీ ఊతం లభిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments