చెట్లు నరికేయడం బాధగా ఉంది
మొక్కలు నాటడమే కాదు సంరక్షణ చేయాలి
నాటే ప్రతీ మొక్కకు జీయో ట్యాగింగ్ అమలు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టీకరణ
రాష్ట్రంలో 3 వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించడంతో పాటు దాని పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖకు రూ.15,485 కోట్లు, గ్రామీణాభివృద్ధిశాఖ రూ.11,217 కోట్లు, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు రూ.713 కోట్లు బడ్జెట్ గ్రాంట్ల కోసం అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్ మాట్లాడారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల్లో పవన్ కల్యాణ్ తీసుకొచ్చిన మార్పులు, జరుగుతున్న అభివృద్ధి గురించి వారి వివరించారు. కొన్ని సూచనలు చేశారు. ఆ తర్వాత రోడ్ల విస్తరణ సమయంలో అడ్డంగా ఉన్నాయంటూ వందేళ్లకు పైబడిన చెట్లను కొట్టేయడం ఆవేదన కలిగిస్తోందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రస్తావించారు. వృక్షాలను కొట్టేయకుండా వేరే దగ్గర వాటిని మళ్లీ నాటితే చిగురిస్తాయని ఈ విధంగా తన నియోజకవర్గంలో చేశామని తన అనుభవాన్ని పంచుకున్నారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రహదారుల విస్తరణ కోసం వందేళ్లకు పైగా వయసున్న వృక్షాలు తొలగించాల్సి రావటం తనను బాధిస్తుందన్నారు. అందుకే వాటిని సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రత్యేక పాలసీ తీసుకు రానున్నట్లు వెల్లడించారు. వందల ఏళ్ల వయసున్న చెట్లను తొలగించడం నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. రోడ్డు పునరుద్ధరణలో అటువంటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు చేపడతాం. గౌరవ సభ్యులు ప్రస్తావించిన జిల్లా పరిషత్‌ల ఏర్పాటు వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేస్తాం. అలాగే మొక్కలకు జియో టాగ్లు పెట్టే ఏర్పాటు చేస్తున్నాం. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ దిశగా తీసుకునే చర్యల గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం.’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నెలరోజుల్లోనే దీనిపై సానుకూల నిర్ణయం వెలువడుతుందన్నారు. స్థానిక ఎన్నికల లోపే కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. మొక్కలు నాటిన తర్వాత వాటి సంరక్షణపైన కూడా దృష్టి పెడతామని అన్నారు. జియో ట్యాగింగ్ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.
