Friday, May 1, 2026
HomePoliticsAndhra Pradeshపుష్కలంగా ఆహార నిల్వలు

పుష్కలంగా ఆహార నిల్వలు

హెచ్చుతగ్గులేమీ లేవు

అదుపులో హోల్ సేల్, రిటైల్ ధరలు

కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరల్లో ఎటువంటి అసాధారణ హెచ్చుతగ్గులేమీ లేవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలకు, అలాగే ఏవైనా అత్యవసర పరిస్థితులకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి అనుపమ్ మిశ్రా వ్యాఖ్యానించారు. “దేశంలో ఆహార భద్రత పరిస్థితిని వినియోగదారుల వ్యవహారాల శాఖ నిశితంగా గమనిస్తోంది. ఆహార పదార్థాల ధరలను పర్యవేక్షిస్తున్నాం. అలాగే ఆహార పదార్థాల నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న 528 కేంద్రాల నుంచి వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రతిరోజూ 40 రకాల వస్తువుల ధరలను పొందుతుంది. హోల్‌సేల్, రిటైల్ ధరలు మొబైల్ యాప్‌లో అప్టేట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మేము గమనించిన వరకు నిత్యావసర వస్తువుల ధరల్లో ఎటువంటి అసాధారణ హెచ్చుతగ్గులు లేవు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పప్పుధాన్యాల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. ప్రభుత్వం వద్ద 28 లక్షల టన్నుల పప్పుధాన్యాల బఫర్ స్టాక్ ఉంది. ఉల్లిపాయలు, బంగాళదుంప, టమాటాల ఉత్పత్తి దాదాపు గతేడాది స్థాయిలోనే ఉంది.” అని అనుపమ్ మిశ్రా పేర్కొన్నారు. 1955 నాటి నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం, వస్తువుల బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని అనుపమ్ మిశ్రా వెల్లడించారు. ఈ విషయంపై తాము రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వల విషయంలో రాష్ట్రాలతో నిరంతరాయంగా సంప్రదింపులు జరిపేందుకు ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుత బఫర్ నిబంధనల కంటే మూడు రెట్లు అధికంగా దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సంయుక్త కార్యదర్శి సి. శిఖ తెలిపారు. దేశంలో ప్రస్తుతం సుమారు 222 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, దాదాపు 380 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. దీంతో మొత్తం ఆహార నిల్వలు సుమారు 602 లక్షల మెట్రిక్ టన్నులకు చేరాయని పేర్కొన్నారు. ఈ నిల్వలు ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాలను, అలాగే ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వాటిని తీర్చడానికి సరిపోతాయని వ్యాఖ్యానించారు. “ఇండోనేసియా, మలేసియా, రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా, బ్రెజిల్ వంటి కీలక భాగస్వాముల నుంచి భారత్‌కు దిగుమతులు నిలకడగా కొనసాగుతున్నాయి. ఇది మొత్తం సరఫరా స్థిరత్వానికి దోహదపడుతోంది. ఆవాలు ఉత్పత్తి మెరుగుపడటం వల్ల, ముఖ్యంగా వంట నూనెల విభాగంలో దేశీయ లభ్యత కూడా బలపడింది.” అని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments