అనకాపల్లి జిల్లాలోని యువతీ, యువకులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం ద్వారా ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. గోవిందరావు ఆదివారం తెలిపారు. ఈ పథకం మూడో దశ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన యువత వెంటనే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా యువతకు ప్రాక్టికల్ అనుభవంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించబడుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన వారు దీనికి అర్హులని పేర్కొన్నారు. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 12 లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన వారికి నెలకు రూ. 9,000 వరకు స్టైపెండ్ అందించబడుతుందని, అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 6,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని వివరించారు. ఇంటర్న్‌షిప్ కాలం 6 నుంచి 9 నెలల వరకు ఉంటుందని, దీని ద్వారా ప్రాక్టికల్ వర్క్ మరియు స్కిల్ ట్రైనింగ్ పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్: 1800 116 090 లేదా స్థానిక జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
