ఆర్డీ నిర్ణయంపై వైద్య ఉద్యోగుల్లో ఉత్కంఠ
` ఆమోదిస్తారా…తిప్పి పంపుతారా
ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసాఛారిని సరెండర్ చేస్తూ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయం ఉద్యోగులు కొందరు శ్రీనివాసాఛారికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేసిన అధికారుల బందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఉత్తర్వులు ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఈయన్ను తిరిగి ఆ కార్యాలయానికి సరెండర్ చేశారు. అయితే దీనిపై వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బుధవారం కూడా ఈ ఫైల్‌ను ఆర్డీ చూసే అవకాశం లేదు. గురువారం ఈ ఫైల్‌కు సంబంధించి నిర్ణయం తెలిసే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఇలాంటి సరెండర్లను వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు అంగీకరించరని అంటున్నారు. అందుకు తాజా ఉదాహరణలను ఉద్యోగ సంఘాల నేతలు ఉటంకిస్తున్నారు. 2025 సంవత్సరంలోనే నగరంలోని ఓ ప్రముఖ ప్రభుత్వ వైద్య శాలలో స్టాఫ్ నర్సును హెడ్ నర్సు ఇష్టానుసారంగా తిట్టింది. ఆమె వేధింపులు భరించలేక ఆ స్టాఫ్ నర్సు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ కూడా ఇప్పటి వలే…సదరు హెడ్ నర్సును వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులకు సరెండర్ చేశారు. దీనిపై ఆర్డీ అంతే సీరియస్‌గా అదే ఆస్పత్రికి తిరిగి పంపించేశారు. ఇలాంటి వివాదాలను రచ్చ చేయాల్సిన అవసరం లేదని ఆ ఇనిస్టిట్యూట్లోనే సర్దు బాటు చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి కూడా
ఆర్డీ అదే ఉత్తర్వులు అమలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. శ్రీనివాసాఛారిపై జరిగిన మొత్తం విచారణను తనకు అందించాలని, లేదా…మళ్లీ విచారణ చేయాలని ఆదేశించే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మరో పక్క ఆఛారిపై ఫిర్యాదు చేసిన ఉద్యోగులందరిపై ప్రైవేట్ రిట్ పిటీషన్ వేయాలని కూడా సూచనలిస్తున్నట్టు తెలుస్తోంది.
